నరసాపురం ఏయంసీ చైర్మన్ గా వలవల నాని
వశిష్ట ప్రగతి (భగవాన్ న్యూస్): నరసాపురం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నరసాపురం పట్టణానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు వలవల రవి కుమార్ ( నాని) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇప్పటివరకు ఏయంసి చైర్మన్ పదవిని అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రేవు సాంబమూర్తి, తిరుమాని కృష్ణంరాజు, కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రాయుడు శ్రీరాములు, గుబ్బల రాధాకృష్ణ, ఎస్సి సామాజిక వర్గానికి చెందిన దొండపాటి స్వాములు, కొల్లాబత్తుల రవికుమార్ లు చేపట్టారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన తరువాత కాపు సామాజిక వర్గానికి చెందిన వలవల నాని ఏయంసి చైర్మన్ పదవిని చేపట్టి ఆ సామాజిక వర్గంలో మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. నరసాపురం రుస్తుంబాద లోని ప్రసిద్ధ పురాతన జగన్నాథ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ గా గతంలో విశిష్ట సేవలను అందించారు. హెల్పింగ్ హెండ్స్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గా నిరుపేదలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, అప్పటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇర్రింకి సూర్యారావుకు వలవల నాని సోదరుడు కావడంతో ఆయన సమక్షంలోనే జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ బలోపేతానికి, ఎమ్మేల్యేగా బొమ్మిడి నాయకర్ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేశారు. వలవల నాని కాపు సంక్షేమ సేన నియోజకవర్గ అధ్యక్షుడుగా సేవలు అందిస్తున్నారు. జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ నరసాపురం పార్లమెంట్ మెంబర్ గా పనిచేసి ప్రస్తుతం ఆ పార్టీ సమన్వయ కమిటీ నియోజకవర్గ సభ్యునిగా, నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నానికి ఏయంసి చైర్మన్ పదవిని కట్టబెట్టడం పై రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు నాని శ్రేయోభిలాషులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Comments
Post a Comment