విద్యతోనే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చు: - శ్రీ సూర్యా స్నాతకోత్సవంలో డాక్టర్ పద్మావతి
వశిష్ట ప్రగతి, నరసాపురం: విద్యతోనే విద్యార్దులు ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చునని నరసాపురం పట్టణానికి చెందిన ప్రముఖ అశ్వని తల్లిపిల్లల ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ మాధంశెట్టి పద్మావతి అన్నారు. శనివారం నరసాపురం పట్టణం స్వరాజ్యరామం వీధిలోని శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియా స్కూల్లో జరిగిన స్నాతకోత్సవం ( కాన్వోకేషన్ డే) వేడుకలకు డాక్టర్ పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని యూకేజీ, 5 వ తరగతులలో ఉత్తీర్ణత సాధించి పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులకు బంగారు పతకాలు, గ్రాడ్యుషన్ సర్టిఫికెట్లు, మెమోంటోలను శ్రీ సూర్య విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, స్కూల్ అకడమిక్ డైరెక్టర్ ఘంటసాల హేమవల్లి, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సతీష్, కళాశాల అకడమిక్ అడ్వయిజర్ బి రామచంద్రారెడ్డి లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు దేశ భవిష్యత్తుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి గొప్పదన్నారు. మానసిక ఒత్తిడికి విద్యార్థులు గురికాకుండా చదువుతో పాటు క్రీడలకు శ్రీ సూర్య విద్యా సంస్థ యాజమాన్యం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. శ్రీనివాస్, స్కూల్ ఇంచార్జ్ డి. శ్రీకళ, ప్రైమరీ, హైస్కూల్ ఉపాధ్యాయులు, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment