బీజీబీఎస్ కళాశాల ఆస్తులను కాపాడి అభివృద్ధి చేయాలి -కోట్ల రామ్ కుమార్
వశిష్ట ప్రగతి, నరసాపురం: అన్యాక్రాంతమైన బిజీబియస్ విద్యా సంస్థల ఆస్తులను కాపాడి అభివృద్ధి చేయాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, అఖిలపక్ష కమిటీ సభ్యుడు కోట్ల రామ్ కుమార్ అన్నారు. బుధవారం నర్సాపురం పట్టణం రాయపేట లో బిజీబియస్ కళాశాల వ్యవస్థాపకుడు పద్మశ్రీ అద్దేపల్లి సర్విశెట్టి విగ్రహాం వద్ద అఖిలపక్షం కమిటి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సర్విశెట్టి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనంలోనే విధవలుగా మారిన మహిళల బాధలను చూసి అద్దేపల్లి సర్విశెట్టి చలించిపోయారని, ఆయనకు వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని స్వగ్రామమైన నరసాపురం వచ్చి స్థిరపడి, మహిళా సంక్షేమం కోసం పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిగా తన యావదాస్తిని సంస్థకు రాసి సేవలు అందించారన్నారు. మహిళలు విద్యావంతులయితే వారిలో చైతన్యం వస్తుందనే తలంపుతో బిజీబియస్ విద్యా సంస్థలను కొంతమంది సహకారంతో సర్విశెట్టి ఏర్పాటు చేశారన్నారు. దాతల సహకారంతో బిజీబియస్ విద్యా సంస్థలను అభివృద్ధి చేశారే తప్ప, ఎన్నడు సంస్థ ఆస్తులను అమ్ముకోలేదన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం తన నుంచి కూడా అద్దేపల్లి సర్విశెట్టి కళాశాల అభివృద్ధి నిమిత్తం విరాళం తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత పాలకవర్గమైన నూలి వెంకట రమణ మూర్తి, నూలి వెంకట నారాయణరావు, తుమ్మలపల్లి భద్రం లు చెల్లని తీర్మానాలు చేసి బిజీబీఎస్ విద్యా సంస్థల ఆస్తులను అమ్మేశారని, ఆ ఆస్తులను తిరిగి కాపాడి బిజీబియస్ విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని కోరారు. అవసరమైతే వాసవి, ఆర్యవైశ్య, మహిళా సంఘాల నుంచి దాతల నుంచి విరాళాలు సేకరించి కళాశాల అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. దీనిపై ఇటీవల తన సోదరుడు కోట్ల రాజా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారని రామ్ కుమార్ తెలిపారు. మహిళ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతే ధ్యేయంగా అద్దేపల్లి సర్విశెట్టి స్థాపించిన బిజిబిఎస్ మహిళా కళాశాల అన్యాక్రాంతం అవడం బాధాకరం అన్నారు. ప్రస్తుత పాలకవర్గం నిర్వహణలో ఈ కళాశాలలో సరైన మౌలిక వసతులు, విద్యార్దుల మరుగుదొడ్లు హీనంగా ఉన్నాయన్నారు. కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు లేవన్నారు. ఇంగ్లిష్ మీడియం స్కూల్, మ్యూజిక్ అండ్ డాన్స్ కళాశాల, పీజీ సెంటర్, సంస్కృత పాఠశాలలు మూసివేయడం దారుణమన్నారు. కళాశాల ఆస్తులను కాపాడి కళాశాలను అభివృద్ధి చేయాలన్నారు. సిపిఎం కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ కళాశాల పాలకవర్గానికి కళాశాల ఆస్తులను అమ్ముకునే హక్కు లేదన్నారు. తక్కువ ధరకు వస్తుందనే ఆలోచనతో నర్సాపురం ప్రాంతానికి చెందిన వారు భూమిని కొనుగోలు చేయడం దారుణమన్నారు. వైసీపీ నాయకుడు కావలి వెంకటరత్నం మాట్లాడుతూ బీజీబిఎస్ కళాశాలను ప్రస్తుత పాలకవర్గం నిర్వీర్యం చేస్తుందన్నారు. నర్సాపురంలో ఉన్న ఏ విద్యా సంస్థలు ఆస్తులను అమ్ముకోలేదని, కానీ బిజిబిఎస్ కళాశాల పాలకవర్గం ఒక్కొక్కటి అమ్మేయడం దారుణమన్నారు. వైఎన్ కళాశాలను అభివృద్ధి పథంలో నడుపుతున్న డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావును బిజిబిఎస్ పాలకవర్గం ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళాశాలను ప్రభుత్వానికి చెందిన ఎస్సీ హాస్టల్ కు అద్దెకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. కళాశాల అధ్యాపకురాలు ఝాన్సీ మాట్లాడుతూ తాను పూర్వ విద్యార్ధిగా అద్దేపల్లి సర్విచెట్టి నీ స్పూర్తిగా తీసుకుని 2008 సంవత్సరం నుంచి అధ్యాపకురాలిగా సేవలు అందిస్తున్నామమే తప్ప కళాశాల యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాదన్నారు. రూ 1800 ఉండే తమ జీతాన్ని 2011 సంవత్సరంలో రూ 4 వేలకు పెంచారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగిస్తున్నారని అన్నారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, టెక్నికల్ గా ఇంటర్మీడియట్ ఎయిడెడ్ కళాశాలగా చూపిస్తున్నారే తప్ప అందులో వాస్తవం లేదన్నారు. కళాశాల కార్యదర్శి కళాశాలను మూసివేసే ఉద్దేశ్యం ఉండటం వల్ల తాము తీసుకువచ్చిన అడ్మిషన్లను పక్కన పడేస్తున్నారని అన్నారు. కళాశాలను అభివృద్ధి చేయడంలో ప్రస్తుత పాలకవర్గం విఫలమైందని, వెంటనే నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. సమావేశంలో అధ్యాపకులు సాగర్, మనోహరి, వైసీపీ నాయకులు పిడి రాజు, బర్రె శంకర్, కోట్ల రామకృష్ణ, కొల్లి నాయకర్, మేడిద సతీష్ మండా రాజ, అప్పన బదరి, తేలనాకుల విజయ్ కుమార్, సమయమంతుల సర్వేశ్వరరావు, కొండేటి నాగేశ్వరరావు, చవల సుబ్రహ్మణ్యం, గన్నాబత్తుల సందీప్ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment