విభిన్న ప్రతిభావంతులే దివ్యాంగులు: ఎమ్మెల్యే నాయకర్
భగవాన్ న్యూస్, నరసాపురం: దివ్యాంగులు బలహీనులు కాదని, విభిన్న ప్రతిభావంతులని రాష్ట్ర ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. సోమవారం నర్సాపురం పట్టణం వలందరేవులో మదర్ థెరిస్సా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయకర్ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలను ప్రకటించిందని, వాటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కరుణ కుమారి, దీపిలు మన దేశం గర్వపడేలా రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. తమ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల మాదిరిగానే దివ్యాంగులకూ ఏపీఎస్ ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయడం జరుగుతుందన్నారు. అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు, ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు తదితర పథకాలను ప్రభుత్వం త్వరలో అమలు చేయనుందని నాయకర్ అన్నారు. దివ్యాంగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమే రూ.6వేల పింఛను ఇవ్వడమేనని అన్నారు. గత ప్రభుత్వం దివ్యాంగులను నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఇంద్రధనస్సు పథకాలు అమలులోకి తీసుకువచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు పాలతో అభిషేకం చేశారు. కేకును కట్ చేసి అందరికీ పంచారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా మత్స్యకార సంఘాల అధ్యక్షులు మైల వసంతరావు, వలవల నాని, వాతాడి కనకరాజు, దేసినీడి గంగాధర్, కూటమి నాయకులు, తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment